24 గంటల్లో కొత్తగా 1,463 కరోనా కేసులు.. 29 మంది మృతి

-

భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,463 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10,815కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 29 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 353కు చేరింది. ఇప్పటివరకు 1190 మంది కరోనా నుంచి కోలుకోగా.. 9,272 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 2,337, ఢిల్లీలో 1,510, తమిళనాడులో 1,173, రాజస్తాన్‌లో 879 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో 624 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం సోమవారం సాయంత్రం వెల్లడించిన హెల్త్‌ బులిటెన్‌లో 592 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది. దీంతో తెలంగాణలో కొత్తగా మరో 32 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కాగా, మంగళవారం నాటి తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల కావాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 353గా నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 160 మంది కరోనాతో మృతిచెందారు. మరోవైపు కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ప్రకటించారు. ఏప్రిల్‌ 20 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. అప్పటివరకు ఉన్న పరిస్థితులను సమీక్షించి కరోనా హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో అంక్షల సడలింపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే కరోనాపై విజయం సాధించేందకు ఏడు సూత్రాలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news