దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కిట్ల ద్వారా పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ ఫలితాలు వెలువడనున్నాయి. ఇన్‌ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి. దీంతో ఏపీ కరోనా నిర్దారణ పరీక్షల వేగం భారీగా పెరగనుందని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు చెప్పారు.
శుక్రవారం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ఈ టెస్టింగ్ కిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు సీఎం జగన్‌కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ పరీక్షలో సీఎం జగన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది.
కాగా, ఈ ర్యాపిడ్ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్ ఉంటాయి. కేవలం బ్లడ్ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్ సొల్యూషన్ వేస్తారు. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ ఉన్నదీ, లేనిదీ కిట్లలో చూపిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. ఐసీఎంఆర్ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది.