ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా కార్తీక పుణ్ణమి సంధర్బంగా కాల్వలో దీపాలు వదలడానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండుకుంది. కార్తీక దీపాలను కాల్వలో వదలడానికి వెళ్లిన ఇద్దరు దంపతులు కాల్వలో పడిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూల్ అబ్బాస్ నగర్ లోని రాజేంద్రప్రసాద్, ఇందిర దంపతులు కార్తీక పుణ్ణమిని పురస్కరించుకుని నిన్న తెల్లవారుజామున 5గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు.
అయితే అక్కడ పూజల అనంతరం భార్య కాల్వలో దీపాలు వదులుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయింది. ఇక ఆమెను రక్షించే క్రమంలో రాజేంద్రప్రసాద్ కూడా కాల్వలో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ ఫలితంలేకుండా పోయింది. కాల్వ ఉధృతి ఎక్కువగా ఉండటంతో దంపతులిద్దరూ నీటిలో కొట్టుకునిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్భంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దంపతులిద్దరి మృత దేహాలను నాలుగు కిలో మీటర్ల దూరంలో గుర్తించి బయటకు తీసారు.