కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (11-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా వైరస్‌కు గాను రష్యా దేశం ప్రపంచంలోనే తొలి టీకాను మంగళవారం విడుదల చేసింది. దానికి స్పుత్‌నిక్ V గా నామకరణం చేసింది. తొలి డోసును ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కుమార్తెకు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అక్టోబర్ నుంచి అక్కడ వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
2. దేశంలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.99 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2.50 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. ఒక మిలియన్‌కు 18,320 పరీక్షలు చేస్తున్నారు. ఈ వారంలోనే 15 లక్షల మంది కోలుకున్నారు.
3. తమిళనాడులో కొత్తగా 5,834 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,08,649కు చేరుకుంది. 5,159 మంది చనిపోయారు. 2,50,680 మంది కోలుకున్నారు. 52,810 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
4. ఏపీలో కొత్తగా 9024 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,44,549కు చేరుకుంది. 2203 మంది చనిపోయారు. 87,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,54,749 మంది కోలుకున్నారు.
5. న్యూజిలాండ్ దేశంలో గత 102 రోజుల తరువాత ఇప్పుడు మళ్లీ కొత్తగా నలుగురికి కరోనా సోకింది. ఒకే ఇంటికి చెందిన నలుగురు కరోనా బారిన పడ్డారు. అయితే వారికి కరోనా ఎలా సోకిందీ తెలియడం లేదు. దీంతో అక్కడ మళ్లీ ఆంక్షలను విధించారు.
6. అమెరికాలో స్కూళ్లను ప్రారంభించడంతో అక్కడ స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ మొత్తం 97వేల మంది పిల్లలకు కరోనా సోకింది. అయితే స్కూళ్లను తెరవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
7. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అన్‌లాక్ 3.0 అమలు జరుగుతున్న తీరును ఆయన సీఎంలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
8. ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవలే ఆమెతోపాటు ఆమె కుటుంబంలోని మొత్తం 12 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌కు తరలించారు.
9. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆదివారం కరోనా సోకిన విషయం విదితమే. ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
10. తెలంగాణలో కొత్తగా 1896 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 82,647కు చేరుకుంది. 645 మంది చనిపోయారు. 59,374 మంది కోలుకున్నారు. 22,628 మంది చికిత్స తీసుకుంటున్నారు.