జలవనరుల శాఖ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివిధ విభాగాల కింద ఉన్న నీటిపారుదల శాఖ ఇక జలవనరుల శాఖగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని, సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని, గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు.