కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (13-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేశారు. ఎంసెట్‌ను అక్కడ సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించనున్నారు. 8 సెట్లకు గాను కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
2. జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉండే పౌరులకు చెందిన కరోనా సమాచారాన్ని జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. పేషెంట్ ఐడీ, వార్డు, సర్కిల్, జోనల్ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఆ వివరాలను రోజువారీగా అప్‌డేట్ చేస్తారు. వాటిని పౌరులు చూసుకుని కోవిడ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవచ్చు.
3. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లే వారు అక్కడ తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే సరిహద్దుల వద్ద వారికి పరీక్షలు చేస్తారు.
4. లాక్‌డౌన్ సమయంలో చనిపోయిన, గాయాలపాలైన దాదాపు 400 వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. వారికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా చనిపోయారు. ఈ క్రమంలో వారికి సోనూసూద్ సహాయం చేయనున్నారు.
5. కోవిడ్ 19 చికిత్సకు ఉపయోగిస్తున్న ఫావిపిరవిర్ మెడిసిన్ ధరలను తగ్గిస్తున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ తెలిపింది. ఈ మందును మార్కెట్‌లో ఆ కంపెనీ ఫాబిఫ్లూ పేరిట విక్రయిస్తోంది. ఒక్క ట్యాబ్లెట్ ధర రూ.103 ఉండగా.. దీన్నిప్పుడు రూ.75కే విక్రయించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.
6. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ 3వ స్థానంలో ఉందని.. అలా అని చెప్పి మోడీ విఫలమైనట్లా అని ప్రశ్నించారు.
7. గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 1500 వరకు పేషెంట్లకు చికిత్స అందించేందుకు బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మంగళవారం నుంచి టిమ్స్‌లో కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందివ్వనున్నారు.
8. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,30,65,164 గా ఉంది. మొత్తం 5,72,272 మంది చనిపోయారు. 76,12,389 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 3,956 మంది కరోనా వల్ల చనిపోయారు. అమెరికాలో మొత్తం 34,14,105 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆ దేశం కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉంది.
9. జీహెచ్ఎంసీ పరిధిలో హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కిట్లను అందజేస్తుందని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పౌరుల కోసం 20వేల హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆ కిట్లలో 17 రోజుల వరకు సరిపోయే మెడిసిన్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, శానిటైజర్, మాస్కులు తదితర వస్తువులు ఉంటాయి.
10. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,701 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,78,254కు చేరుకుంది. మొత్తం 23,174 మంది చనిపోయారు. 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,53,470 మంది కోలుకున్నారు.