కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (09-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీంతో మొత్తం 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
2. కరోనా మహమ్మారి వల్ల భారత ఫార్మా రంగం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఆయన బ్రిటన్‌లో నిర్వహించిన ఇండియా గ్లోబల్ వీక్ 2020 సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. దేశం ఓ వైపు కరోనాపై పోరాటం చేస్తూనే.. మరో వైపు ఆర్థిక పునరుద్ధరణ దిశగా ముందుకు సాగుతుందని మోదీ అన్నారు. విపత్తు సమయంలో భారత ఫార్మా రంగం మన దేశానికే కాదు.. ప్రపంచానికే ఓ ఆస్తిలా మారిందని అన్నారు.
3. అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చాలా ప్రయోగాలు కీలకదశలో ఉన్నాయని.. అవి పూర్తయ్యేందుకు కనీసం 6 నెలలైనా పడుతుందని.. అందుకని వచ్చే ఏడాది ఆరంభంలో కరోనాకు టీకా వస్తుందని ఆయన అన్నారు.
4. కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్మాను దానం చేయాలని మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పిలుపునిచ్చారు. ముంబైలోని అంథేరి సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని సచిన్ ప్రారంభించి ఆ వ్యాఖ్యలు చేశారు.
5. కరోనా వైరస్ నేపథ్యంలో ఆసియాకప్ 2020ని వాయిదా వేశారు. ఆసియా క్రికెట్ మండలి ఈ మేరకు ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2021లో ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించనున్నారు.
6. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగులను రక్షించేందుకు ప్రస్తుతం ఇస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను ఇన్‌హేలర్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు గిలియాడ్ సైన్సెస్ ఆ ఇంజెక్షన్‌ను ఇన్‌హేలర్ రూపంలో తయారు చేస్తోంది. దీని వల్ల రోగులు ఆస్పత్రికి రావల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రాణాపాయ స్థితి రాకుండా చూసుకోవచ్చు.
7. ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశమైన భారత్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి 538 కరోనా పాజిటివ్ వస్తుందని, కానీ ఇతర దేశాల్లో ఇంతకన్నా 17 రెట్ల వరకు ఎక్కువ ప్రభావం ఉందని తెలిపింది.
8. కేరళ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు పోలీసులను కాదని ఏకంగా కమాండోలనే రంగంలోకి దించింది. అక్కడి పూంతూర గ్రామంలో కరోనా కేసులు విపరీతంగా వస్తుండడంతో లాక్‌డౌన్ పెట్టారు. అయినా జనాలు వినడం లేదు. దీంతో కమాండోలను రంగంలోకి దించారు.
9. భారత్‌లో కరోనా సమూహ వ్యాప్తి లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కేవలం 8 రాష్ట్రాల్లోనే 90 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. దేశంలో రికవరీ రేటు 62 శాతానికి చేరుకుందన్నారు.
10. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,879 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,296కు చేరుకుంది. మొత్తం 21,129 మంది చనిపోయారు. 4,76,377 మంది కోలుకున్నారు. 2,69,789 మంది చికిత్స తీసుకుంటున్నారు.