చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. దేశాల ఆర్థిక వ్యవస్థను, ప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజు వారీ కేసులు 15 వేలకు తక్కువగానే నమోదవుతున్నాయి. పరిస్థితులు చక్కబడటంతో చాలా రాష్ట్రాల్లో విద్యాలయాలు ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ఇదే కొన్నిచోట్ల కొంప ముంచుతోంది. విద్యార్థులకు ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకుతోంది.
తాాజాగా ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఇంటికి వెళ్లి వచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఈ ఫలితాల్లో విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మిగతా విద్యార్థులకు పరీక్షలు చేయించగా 27 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు కొనసాగుతున్నాయి.
కాగా కోవిడ్ సోకిన వారిని ఇంటికి పంపించారు. మొత్తం 650 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిన్నామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఇదిలా ఉండగా వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలంపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు జిల్లా వైద్య శాఖ అధికారులను ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని మంత్రి కోరారు.