సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని విమర్శించారు. ఒక పక్క వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు కూడా నడపక పోవటం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల శాడిజానికి పరాకాష్ట కాదా ? అని ఆయన ప్రశ్నించారు. పండుగ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య ఈ దసరా పండుగ నుంచైనా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆయన డిమాండ్ చేశారు.
రైళ్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తెలంగాణ ఎపీల మధ్య రాకపోకలకై ఆర్టీసీ బస్సులే ఆధారమని అయన అన్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ అన్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా చార్జీలు వసూలు చేస్తున్నాయని అన్నారు. పండుగల సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాలనుంచి ఏపీలోని స్వస్థలాలకు రావాలనుకున్న వారికి నిరాశ ఎదురవుతోందని అన్నారు.