జ‌గన్ కంచుకోటలో టీడీపీ సీనియర్ల సవారి కష్టమేనా..?

-

కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి జిల్లాలో జగన్‌కు ఎదురులేదు. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో సైతం, కర్నూలులో వైసీపీ హవానే నడిచింది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 11 గెలిస్తే, టీడీపీ కేవలం మూడు చోట్ల గెలిచింది. రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. మొత్తం సీట్లు వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.

ఎన్నికలైన తర్వాత కూడా ఇక్కడ టీడీపీకి పుంజుకునే ఛాన్స్ రావడం లేదు.  అయితే పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా టీడీపీ అధ్యక్షులని నియమించారు. అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్‌కు సోమిశెట్టి వెంకటేశ్వర్లుని, నంద్యాలకు గౌరు వెంకట రెడ్డిని నియమించారు. ఇక ఈ ఇద్దరు సీనియర్లు వైసీపీ కంచుకోటలో సైకిల్ సవారి ఎంతవరకు చేయగలరనేది చెప్పలేం. ఎందుకంటే 14 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీనే ఉంది. పైగా వైసీపీ అధికారంలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి చెక్ పెట్టే సత్తా టీడీపీ నాయకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు అడ్రెస్ లేరు. కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. అటు ఆలూరులో కోట్ల భర్త సుజాతమ్మ సైతం యాక్టివ్‌గా ఉన్నట్లు లేరు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు అసెంబ్లీ, మంత్రాలయం స్థానాల్లో టీడీపీ నేతలు దూకుడుగా లేరు.

అటు నంద్యాల పార్లమెంట్‌ స్థానంలో మాండ్ర శివనందరెడ్డి అడ్రెస్ లేరు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి తప్పా, మిగతా శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, డోన్, నంద్యాల స్థానాల్లో నేతలు అసలు యాక్టివ్‌గా లేరు. మరి దీని బట్టి చూస్తే కర్నూలులో టీడీపీ అధ్యక్షులు సైకిల్‌ని ఎలా లైన్ చేయగలరో చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news