ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 5వ మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్‌పై సెయింట్ లూసియా జౌక్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బార్బడోస్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. 18.1 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఆ జట్టులో చార్లెస్ (19 బంతుల్లో 35 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హోల్డర్ (12 బంతుల్లో 27 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో కుగెలెయిన్, చేజ్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, నబీ, కెస్రిక్ విలియమ్స్, మార్క్ డెయాల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అయితే వర్షం కారణంగా కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. కాగా వర్షం తగ్గిన అనంతరం మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సెయింట్ లూసియా టార్గెట్‌ను 5 ఓవర్లలో 47 పరుగులకు కుదించారు. దీంతో సెయింట్ లూసియా జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఆ జట్టు 4.1 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసి అలవోకగా టార్గెట్‌ను ఛేదించింది.
ఇక సెయింట్ లూసియా జట్టులో నబీ (6 బంతుల్లో 15 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్), ఆండ్రూ ఫ్లెచర్ (7 బంతుల్లో 16 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. అలాగే బార్బడోస్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, రేమాన్ రెయిఫర్ 1 వికెట్ పడగొట్టాడు.