ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 3వ మ్యాచ్‌లో సెయింట్ లూసియా జౌక్స్‌పై జమైకా తలావాహ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన జమైకా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా సెయింట్ లూసియా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
సెయింట్ లూసియా జట్టులో ఆర్ఎల్ చేజ్ (42 బంతుల్లో 52 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. జమైకా బౌలర్లలో వి పెర్‌మాల్, ముజీబ్ ఉర్ రహమాన్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. ఏడీ రస్సెల్, ఎస్ లమిచ్చనెలు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జమైకా 18.5 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. జమైకా జట్టులో ఆసిఫ్ అలీ (27 బంతుల్లో 47 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జీడీ ఫిలిప్స్ (29 బంతుల్లో 44 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)లు అద్భుతంగా రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో కేవోకే విలియమ్స్ 2 వికెట్లు తీయగా, ఎస్‌సీ కుగెలెయిన్, ఓసీ మెక్ కాయ్, ఆర్ఆర్ఎస్ కార్న్‌వాల్‌లు తలా 1 వికెట్ తీశారు.