ముఖం, చేతులు కాళ్లవలే పాదాల పరిశుభ్రత చాలా అవసరం. పగిలిన పాదాలు బాగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు నడవడం కూడా కష్టంగా మారుతుంది. లోతైన పగుళ్ళు, వాపు, నొప్పికి దారి తీస్తాయి. అందువల్ల పాదాలను మృదువుగా ఉంచుకునేందుకు ఇంటి చిట్కాలు పాటించాలి.
మృదువైన మడమలను ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కాకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల మడమల్లో పగుళ్ళు ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి మీ వంటింట్లో ఉన్న పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది.
దీనికోసం 100మిల్లీ లీటర్ల సీడ్ ఆయిల్, అరలీటర్ పాలు, కొన్ని గులాబీ రేకులు, కొన్ని వేప ఆకులు, 5చుక్కల జెరేనియం, 5చుక్కల గంధపు నూనె, 5చుక్కల గోధుమ నూనె తీసుకోవాలి.
వీటన్నింటినీ కలిపి టబ్ లో ఉంచిన సబ్బునీళ్ళలో కలపాలి. ఆ తర్వాత 20నిమిషాల పాటు పాదాలను నానబెట్టండి. చీలమండల దగ్గర చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఫ్యూమిస్ రాయిని ఉపయోగించవచ్చు.
రాతి ఉప్పు, లావెండర్ నూనె
లావెండర్ నూనెలో రాతి ఉప్పు కలిపి పగిలిన పాదాలపైన మర్దన చేయాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
నిమ్మకాయ, చక్కెర
దీనికోసం నిమ్మకాయలను ముక్కలుగా కోసి, ఆ ముక్కలకి చక్కెర అంటించుకుని పాదాలపైన రుద్దాలి. ఈ విధంగా చనిపోయిన చర్మకణాలు తొలగిపోయి చర్మం మడమలు మృదువుగా మారతాయి.
కలబంద రసం
కలబంద రసంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కలబందని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. కలబంద రసాన్ని రాత్రిపూట పాదాలకి వర్తిస్తే మంచి ఫలితం ఉంటుంది. వర్తించే ముందు పాదాలను శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు.