ఏదైనా కీలక వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు కాస్త ఉత్సాహంగా హుషారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి ఆటగాడి వికెట్ తీయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయినా లేక అతను దిగ్గజ ఆటగాడు అయిన సరే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. అయితే ఈ సమయంలో ఆటగాళ్ళు కాస్త భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగే జరిగింది సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో.
ఇంగ్లాండ్ కీలక ఆటగాడు జో రూట్ వికెట్ తీసిన సఫారి పేస్ బౌలర్ కగీసో రాబాడా అతని వద్దకు వెళ్లి మీద గట్టిగా గుద్ధుతూ సంబరం చేసుకుంటాడు. దీనిపై ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ రబాడకు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించడమే కాకుండా అతడికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. దీనిపై పలువురు మాజీ ఆటగాళ్ళు అసహనం వ్యక్తం చేసారు. అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు.
స్కైస్పోర్ట్స్ టీవీ ఛానల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఎమోషన్ ను మనస్ఫూర్తిగా వ్యక్తపరచాలని, తన పిల్లలకు కూడా అదే చెబుతానని, రబాడ చేసిన తప్పేంటో తనకర్థం కావడం లేదని, కనీసం రూట్‌ను అతడు తాకను కూడా తాకలేదని, అతడు ఎమోషనల్‌గా ప్రవర్తించడమే తప్పయితే మనుషుల బదులు 11 రోబోట్లతో క్రికెట్ ఆడిస్తే సరిపోతుంది అంటూ వ్యాఖ్యానించాడు.