సైకో భర్త.. భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి

అదనపు కట్నపు వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చాడు భర్త. కానీ, ఈసారి తన వక్రబుద్ధిని చూపాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. తన వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అది చూసి అవాక్కయిన ఆ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహారాష్ట్రలోని బివండికి చెందిన వ్యక్తికి కౌరర్‌కు చెందిన 28ఏండ్ల యువతితో 2015లో వివాహం జరిగింది. రూ.12లక్షలు వెచ్చించి వివాహం చేయడంతోపాటు రూ.5లక్షల బంగారం కూడా ఇచ్చారు. అయినా భర్త వరకట్న దాహం తీరలేదు. భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు ఫ్లాట్ కోసం డిమాండ్ చేశాడు. భర్త వేధింపులు తీవ్రం కావడంతో ఆ ఇల్లాలు పలుమార్లు ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్తపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టారు. ఎట్టకేలకు భర్త బుజ్జగించడంతో భార్య కేసును వాపసు తీసుకున్నది.

గత ఏడాది జనవరిలో భార్యభర్తలు కలిసి థానేలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో భార్య స్నానం చేస్తుండగా భర్త వీడియో చిత్రీకరణ చేశాడు. భర్త వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం ఆమె తిరిగి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి రాకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడుతానని భార్యను భర్త బెదిరించాడు.

భర్త వాట్సాప్ స్టేటస్‌లో తాను స్నానం చేస్తున్న వీడియోను గమనించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.