2018 నవంబర్‌లో గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ యువతిపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. అయితే బాధిత యువతి ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.
అన్యాయం జరిగింది.. న్యాయం చేయండని మొర పెట్టుకునే లోపే అన్యాయం చేసిన వారు వచ్చి బాధితులను చంపేందుకు యత్నిస్తే.. ఇక ఆ బాధిత కుటుంబానికి ఎంత బాధ కలుగుతుందో చెప్పండి.. అలాంటి వారు ఇకపై న్యాయం చేయండని కోర్టు మెట్లు ఎక్కగలరా..? వారిని చూసి ఇంకొకరు కూడా తమకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారా..? అస్సలే రారు.. భయపడుతారు.. అలాంటప్పుడు ఇక దేశంలో బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది..? యూపీలోని నోయిడాలోనూ సరిగ్గా ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి (28)కి 2011లో గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ యువకుడితో వివాహం అయింది. అయితే అతను కట్నం కోసం వేధిస్తుండడంతో ఆమె అతన్ని వదిలేసి అక్కడే నోయిడాలో ఒంటరిగా ఉంటూ ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే 2018 నవంబర్‌లో ఆ యువతిపై కొందరు సామూహిక అత్యాచారం చేశారు. అయితే బాధిత యువతి ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అన్వేషించడం మొదలుపెట్టారు.
కాగా ఆ కేసు నిన్న కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఆ యువతిని కోర్టుకు వెళ్లకుండా అప్పట్లో గ్యాంగ్ రేప్ చేసిన యువకులు ఇద్దరు, మరొక యువకుడు ఆమెను బుధవారం కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె తలపై ఇనుప రాడ్లతో బలంగా కొట్టారు. ఆమెను గొంతు నులిమారు. ఇక ఆమె చనిపోయిందనుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆ యువతిని చూసి హాస్పిటల్‌లో చేర్పించి ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆ యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించినా.. మరొక యువకుడి జాడ తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఆ యువతి ఆసుపత్రిలో పడుతున్న బాధ వర్ణనాతీతం. నిజంగా ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం.. ఈ తరహా చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప.. ఇలాంటి దారుణాలు ఆగవు..!