ప్రేమికులు అనే ముద్ర.. స్నేహితుల ఆత్మహత్యాయత్నం.. యువకుడు మృతి

ఓ యువతి, యువకుడు కొంచె చనువుగా మెలిగితే చాలు.. ప్రేమికులు అనే సందేహం వస్తుంది. ఇంట్లో వాళ్ల నుంచి ఫ్రెండ్స్ వరకూ అందరూ ఎగతాళి చేస్తూనే ఉంటారు. అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహం అనేది అబద్ధమంటూ వారిని ఆటపట్టిస్తుంటారు. కొందరు దీన్ని లైట్ తీసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఇలాంటి విషయాల్లో సున్నితంగా ఉంటారు. ఎవరైనా తమ స్నేహితుడు/స్నేహితురాలితో ఉన్న బంధాన్ని అపార్థం చేసుకుంటే తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితే ఎదురైన ఇద్దరు స్నేహితులు ఎదుటివారి మాటలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.

నిజామాబాద్‌లో నందిపేట్‌ మండలానికి చెందిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. యువతి, యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. యువకుడు వినయ్‌కుమార్‌ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. తమ స్నేహాన్ని అందరు ప్రేమ అని అపార్థం చేసుకుంటున్నందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ లో రాసి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.