లైంగిక దాడితో ఊపిరి ఆడనందువల్లే కథువా చిన్నారి మృతి.. వెల్లడించిన వైద్యులు..!

-

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన ఓ బాలిక (8)పై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన విషయం విదితమే. కాగా ఈ సంఘటన అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఓ దశలో నిందితులను రక్షిస్తున్నారంటూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తగా సుప్రీం కోర్టు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణను పఠాన్‌కోట్ జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు.

కథువా చిన్నారిపై ముందుగా లైంగిక దాడి జరిగిందని, అనంతరం ఆమెకు సెడేటివ్స్ ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆ తరువాత ఆ మృగాళ్లు జరిపిన లైంగిక దాడికి ఊపిరాడక ఆ చిన్నారి చనిపోయిందని, ఆ బాలిక మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా న్యాయమూర్తి ఎదుట వివరించారు. నిందితులు జరిపిన లైంగిక దాడికి ఊపిరి ఆడకపోవడం వల్ల కథువా చిన్నారి మృతి చెందిందని వైద్యులు జేకే చోప్రాకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివరాలను రికార్డు చేశారు.

కథువా అత్యాచారం కేసులో మొత్తం 7 మందిపై జూన్ 8వ తేదీన చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుల్లో ఆలయ సంరక్షకుడు సాంజీరామ్, అతని కుమారుడు విశాల్, మేనల్లుడు, స్నేహితుడు పర్వేష్ కుమార్, పోలీస్ అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ దత్తాలు ఉండగా, తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలను ఇప్పటికే డిపార్ట్‌మెంట్ నుంచి తీసేశారు. వీరు రూ.4 లక్షల లంచం తీసుకుని కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు, నిందితులను కాపాడే యత్నం చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 54 మంది సాక్ష్యులను విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news