పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిని త‌ప్పించడం కోసం.. మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌త‌ను.. చివ‌రికి ఏమైందంటే..?

-

ర‌విసింగ్ ఎలాగైనా త‌న పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిని తప్పించాల‌ని అనుకుని ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌కున్నా.. త‌న‌కు తానే కిడ్నాప్ అయి ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని త‌న తండ్రికి, బంధువుల‌కు మెసేజ్ పెట్టాడు.

నేటి త‌రుణంలో యువ‌తీ యువ‌కులు ప్రేమించుకోవ‌డం, పెద్ద‌ల అంగీకారం లేకున్నా వారిని ఎదిరించి పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఎక్కువైపోయింది. పెద్ద‌లు అంగీక‌రిస్తే ఫ‌ర్వాలేదు, కానీ చాలా వ‌ర‌కు ప్రేమ పెళ్లిళ్లు పెద్ద‌ల అంగీకారం లేకుండానే జ‌రుగుతున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఓ ఇంజినీర్ తాను ప్రేమించిన యువ‌తిని పెళ్లాడుదామ‌ని ఫిక్స‌యితే త‌ల్లిదండ్రులు అది కుద‌ర‌ద‌ని చెప్పి మ‌రొక యువ‌తితో అత‌నికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. దీంతో ఎలాగైనా త‌ల్లిదండ్రులు కుదిర్చిన వివాహం నుంచి త‌ప్పించుకోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. కానీ అది ఫెయిలైంది.. ఢిల్లీలో జ‌రిగిన ఈ సంఘ‌టన ఇప్పుడ‌క్క‌డ సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఢిల్లీలో నివాసం ఉండే ర‌విసింగ్ అనే 31 ఏళ్ల ఓ ఇంజినీర్ అక్క‌డే ఓ కంపెనీలో ప‌నిచేస్తూ స్థానికంగా ఓ పేయింగ్ గెస్ట్ హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. అత‌ను ఢిల్లీ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న ఓ యువ‌తిని ప్రేమించాడు. ఆమెతో పెళ్లికి సిద్ధ‌మయ్యాడు. కానీ త‌ల్లిదండ్రులు మాత్రం అత‌ని ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా రవి సింగ్‌కు వేరే యువ‌తితో వివాహం నిశ్చ‌యించారు. అయితే పెళ్లి రోజు ద‌గ్గ‌ర ప‌డుతుండడంతో ర‌విసింగ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్ప‌టికే శుభ‌లేఖ‌లు కూడా పంచారు. ఈ క్ర‌మంలోనే ర‌విసింగ్ ఎలాగైనా త‌న పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిని తప్పించాల‌ని అనుకుని ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌కున్నా.. త‌న‌కు తానే కిడ్నాప్ అయి ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని త‌న తండ్రికి, బంధువుల‌కు మెసేజ్ పెట్టాడు. రూ.5 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కిడ్నాప‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ని అత‌ను మెసేజ్ చేశాడు.

ర‌విసింగ్ అలా మెసేజ్ పెట్టే స‌రికి అత‌ని కుటుంబ స‌భ్యులు, బంధువులు కంగారు ప‌డ్డారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టి విచారించ‌గా.. అస‌లు రవిసింగ్ కిడ్నాప్ కాలేద‌ని తెలిసింది. అలాగే అత‌ను త‌న పేయింగ్ గెస్ట్ హౌజ్ స‌మీపంలోనే ఉన్నాడ‌ని తెలియ‌డంతో పోలీసులు అక్క‌డికి వెళ్లి ర‌వి సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల‌కు పట్టుబ‌డ్డ ర‌విసింగ్ మాత్రం.. త‌న‌కు పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి వ‌ద్ద‌ని, తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుంటాన‌ని, అందుక‌నే త‌న త‌ల్లిదండ్రులు నిశ్చ‌యించిన పెళ్లిని త‌ప్పించ‌డానికే ఆ ప‌ని చేశాన‌ని చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ర‌విసింగ్ అలా కిడ్నాప్ డ్రామా ఆడి ఉండ‌కూడ‌దు. అలాగ‌ని చెప్పి అత‌ని త‌ల్లిదండ్రులు అత‌నికి న‌చ్చ‌ని యువ‌తితో వివాహం చేయ‌డం కూడా స‌బ‌బు కాదనుకోండి. మ‌రి ఈ సంఘ‌ట‌న‌తోనైనా ర‌విసింగ్ త‌ల్లిదండ్రులు మారి అత‌ను కోరుకున్న యువ‌తిని ఇచ్చి వివాహం జ‌రిపిస్తారో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version