ప్రియురాలితో గొడ‌వ‌ప‌డి నోట్లో సుతిల్ బాంబ్ పెట్టుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు

ఆ ఇద్ద‌రి వ‌య‌స్సూ ఎక్కువే. వృద్ధాప్యంలో ఉన్నారు. అప్ప‌టికే ఎన్నో ఏళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. కానీ వారిద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లు వ‌చ్చాయి. అంత మాత్రానికే ఆ వ్య‌క్తి త‌న ప్రియురాలిపై దాడి చేయ‌డంతోపాటు తానూ ఆత్మ‌హత్య‌కు య‌త్నించాడు. ఫ‌లితంగా ఇద్ద‌రూ ప్రాణాపాయ స్థితిలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే…

man tried to kill self with sutli bomb in mouth

ముంబైలోని మ‌ల‌ద్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన స‌చిన్ చౌహాన్ (55) అనే వృద్ధుడు త‌న క‌న్నా 3 ఏళ్ల వ‌య‌స్సు ఎక్కువ ఉన్న మ‌రో వృద్ధురాలితో 15 ఏళ్ల నుంచి స‌హజీవ‌నం చేస్తున్నాడు. ఆమె అంధేరీలో ప‌లు సొసైటీల్లో వంట మ‌నిషిగా ప‌నిచేస్తోంది. ఆ మ‌హిళ 80 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న త‌న త‌ల్లితో క‌లిసి జీవించ‌డం మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో త‌న ప్రియురాలి కోసం స‌చిన్ చౌహాన్ ఎప్పుడూ వారి ఇంటికి వ‌చ్చేవాడు. ఇది ఆ మ‌హిళ త‌ల్లికి ఇష్టం ఉండేది కాదు. దీంతో చౌహాన్‌కు, త‌న ప్రియురాలికి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి.

అయితే ఆదివారం కూడా ఎప్ప‌టిలాగే చౌహాన్ వారి ఇంటికి వ‌చ్చాడు. ఆమె త‌ల్లి మ‌రోసారి అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసింది. దీంతో చౌహాన్‌కు, అత‌ని ప్రియురాలికి మ‌ధ్య ఎప్ప‌టిలాగే గొడ‌వ జ‌రిగింది. అయితే చౌహాన్ ఒక్క‌సారిగా ప‌ట్ట‌రానంత కోపంతో ఊగిపోతూ ప‌క్క‌నే ఉన్న క‌త్తితో త‌న ప్రియురాలిపై దాడి చేశాడు. ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆమె ముఖానికి, మెడ‌కు తీవ్ర‌మైన గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌ను త‌న నోట్లో సుతిల్ బాంబ్ పెట్టుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. అయితే అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో ఇద్ద‌రినీ చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. వారిద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు వారు చౌహాన్‌పై కేసు న‌మోదు చేశారు.