కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్… తమ స్థావరంగా దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్ని ఎంచు కున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి సిరియాలో ఉగ్ర శిక్షణ తీసుకున్న ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులు బెంగళూరులో మకాం వేసినట్లు సమాచారం. ఈమేరకు నగరంలో ఉగ్రవాదు ల కదలికలను ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలోని ఎంఎస్.రామయ్య దవాఖానలో డాక్టరుగా పని చేస్తున్న బసవనగుడి నివాసి అయిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ను ఐసీస్ ఉగ్రవాదిగా అనుమానించి గత నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించడంలో డాక్టర్ రెహమాన్ కీలకంగా వ్యవ హరించినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాచారంతో గుర్రప్పనపాళ్యలోని బిస్మిల్లానగరలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీ చేపట్టగా ఏడుగురు యువకులు కొంతకాలంగా కనిపించలేదని తేలింది. వీరంతా సౌదీ అరేబియా ద్వారా ఇరాన్ సరిహద్దుకు చేరుకుని అక్కడి నుంచి సిరియాకు వెళ్లినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ‘మేకింగ్ ఆఫ్ ఫ్యూచర్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించినట్లు సమాచారం. కాగా ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న బెంగులూరు నగరంలో ఐసిన్ ఉగ్రవాదుల ఛాయలు కనిపించడంతో నగరవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.