కేరళలో టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

విజయదశమి పర్వదినాన కేరళ పాలపక్కడ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో పాలక్కడ్​ జిల్లా వడక్కంచేరి వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత టూరిస్ట్ బస్సు వడక్కంచేరి వద్ద వేగంగా వెళ్లి.. కేఎస్​ఆర్​టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. వెంటనే విద్యార్థులు ఉన్న బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.

ప్రమాద సమయంలో ఆర్​టీసీ బస్సు 49 మంది ప్రయాణికులతో కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్ వెళ్తోంది. ఆర్​టీసీ బస్సులోని ప్రయాణికుల్లో ఒకరు మరణించారు. టూరిస్ట్​ బస్సులోని ఓ టీచర్ మరణించగా.. మిగిలిన మృతులంతా విద్యార్థులని తెలిసింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు.