తన వద్ద పని చేసే అమ్మాయని ప్రేమ పేరుతో మోసం చేశాడో ఓ ప్రబుద్ధుడు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. దీని తర్వాత ఆ అమ్మాయి ఆనారోగ్యం పాలైంది. ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నగరంలోని అత్తాపూర్ లో చోటు చేసుకుంది. కాగ శ్రీనివాస్ అనే యువకుడు.. అత్తాపూర్ లో ఒక దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఒక అమ్మాయిని పనిలో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి.. లోబర్చుకున్నాడు. చివరికి ఆ యువతి గర్భం దాల్చింది.
గర్భం తీసివేసిన తర్వాత వివాహం చేసుకుందామని అమ్మాయితో శ్రీనివాస్ అన్నాడు. దీంతో తన స్నేహితుడితో కలిసి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. అబార్షన్ అయిన కొద్ది రోజుల తర్వాత.. ఆ అమ్మాయికి తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు.. గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఏం జరిగిందని నిలదీయడంతో.. జరిగిన విషయాన్ని అమ్మాయి తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే స్నేహితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.