సోషల్ మీడియాను ఉపయోగించడం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే సంఘటన ఇది. ముంబైలో చోటు చేసుకుంది. ఓ యువతికి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం కాగా వారిద్దరూ స్నేహితులు అయ్యారు. అయితే ఆ యువతి వెకేషన్ కు వెళ్లిందని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆమె ఇంట్లో చొరబడి ఏకంగా రూ.14 లక్షల విలువైన నగలు, నగదును చోరీ చేశాడు. చివరకు ఆ యువతి అసలు విషయం చెప్పడంతో ఆ వ్యక్తి గురించి తెలిసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలోని మజాగావ్‌కు చెందిన షైజాన్ అగ్వాన్ (19) అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు వారిద్దరూ బయట కూడా అనేక సార్లు కలుసుకున్నారు. వారిమధ్య స్నేహం పెరిగింది. ఆ యువతి తల్లి ముంబైలో పేరుగాంచిన చార్టర్డ్ అకౌంటెంట్. అయితే ఆమె తన తల్లితో కలిసి ఇటీవలే లాంగ్ వెకేషన్‌కు వెళ్లింది. ఆ విషయం తెలుసుకున్న అగ్వాన్ ఆమె ఇంట్లో చొరబడి రూ.14 లక్షల విలువైన నగలు, నగదును తస్కరించాడు. అయితే చిత్రం ఏమిటంటే.. అతనికి తమ ఇంట్లోకి వచ్చేందుకు ఆ యువతి ఏకంగా తమ ఇంటికి చెందిన డూప్లికేట్ తాళం చెవులను కూడా ఇచ్చింది. వారు కలుసుకునేందుకు ఆమె ఆ తాళం చెవులను ఇచ్చింది. కానీ అతను ఇలా దొంగతనం చేస్తాడని ఆమె అనుకోలేదు.
అయితే ఇంట్లో ఉన్న నగలు, కొంత క్యాష్ పోయాయని గ్రహించిన ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారు విచారణ చేపట్టి ఆ యువతిని కూడా వివరాలు అడిగారు. ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో నిందితున్ని అతని ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఒక ఐఫోన్, రూ.1 లక్ష క్యాష్‌ను రికవరీ చేయగలిగారు. సోషల్ మీడియాలో అపరిచితులను పరిచయం చేసుకోవడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ సంఘటన మనకు కళ్లకు కడుతుంది.