సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణల ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా ఎదుట ఏబీ వెంకటేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఏబీపై వచ్చిన అభియోగాలపై సిసోడియా వివరణ కోరారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పై మోపిన అభియోగాలకు సంబంధించిన శాఖాపరమైన విచారణకు గతంలోనే కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో సచివాలయంలో అభియోగాలపై విచారణ జరిగింది.
ఏబీపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ చేపట్టాలని విచారణాధికారిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విచారణ నివేదికను మే 3 తేదీ నాటికి కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక మాజీ డీజీపీలు జేవీ రాముడు, ఎన్. సాంబశివరావు, కీలక అధికారులు మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ లను కూడా సాక్షులుగా విచారణకు హాజరు కావాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది.