ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది సంజీవ్ లోధీ ఛాంబర్ లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తి నాటు బాంబు విసిరాడు. ఈ బాంబు దాడిలో న్యాయవాది లోధీకి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కానీ, ఆయన ఛాంబర్ ముందు నిలబడి ఉన్న ఇద్దరు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.
కోర్టు కాంప్లెక్స్‌లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఘటన జరుగడంతో తీవ్ర కలకలం చెలరేగింది. కాగా, ఘటనపై న్యాయవాది సంజీవ్ లోధీ వజీర్‌గంజ్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐపీసీలోని 147, 148, 149, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, తన ఛాంబర్‌పై నాటు బాంబు దాడికి మరో న్యాయవాది జీతూ యాదవ్ కారణమని సంజీవ్ లోధీ ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైతం జీతూ యాదవ్‌పై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, న్యాయవాదులే ఇట్లా భౌతిక దాడులకు తెగబడితే సాధారణ జనం పరిస్థితి ఏందని పలువురు ప్రశ్నిస్తున్నారు.