మిస్డ్‌ కాల్‌తో రూ.50లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు..

-

డబ్బులు సంపాదించడమే కాదు.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఈరోజుల్లో పెద్ద కష్టమైన పనే.. ఇంట్లో ఉంచుకుంటే.. దొంగల భయం.. అకౌంట్లో పెట్టుకుంటే.. సైబర్‌ నేరగాళ్ల భయం.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రకంగా సైబర్‌ మోసం జరుగుతూనే ఉంది. ఎవర్ని నమ్మలేని పరిస్థితి.. పెరుగుతున్న టెక్నాలజీ కొత్తరకం సైబర్ మోసాలకు నాంది పలుకుతుంది. కరెంట్‌ బిల్లలు చెల్లించలేదంటూ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఈ కేవైసీ అప్‌డేట్‌ అంటూ, లిమిట్‌ పెంచుతామని, వెరిఫికేషన్‌ అని ఇలా ఏది పడితే అది చెప్పి చిటెకలో వారి పని కానిచ్చేస్తున్నారు. తాజాగా జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇచ్చి రూ. 50 లక్షలు కాజేశారు..

కేవలం మిస్డ్ కాల్‌తో రూ. 50 లక్షలు కొట్టేశారు. అదేంటి ? మిస్డ్ కాల్‌తో కూడా డబ్బులు కొట్టేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సాధారణంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఓటీపీ కచ్చితంగా అవసరం అవుతుంది. అయితే ఇక్కడ ఓటీపీతో పని లేకుండానే రూ. 50 లక్షలు కొట్టేశారు. మిస్డ్ కాల్‌తో ఈ పని పూర్తి చేశారు. ఎలా అంటే..

దక్షిణ ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్ అకౌంట్ నుంచి మోసగాళ్లు రూ. 50 లక్షలు కాజేశారు. ఈయనకు రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల మధ్యలో మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఒక్కసారి కాదు చాలా సార్లు ఇలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. కొన్ని కాల్స్‌ను ఈయన ఎత్తారు. అయితే అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందువల్ల కట్ చేశారు. తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయలేదు.

అయితే కొద్ది సేపటికే ఆయన ఫోన్‌కు ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ మెసేజ్ వచ్చింది. రూ. 50 లక్షలు డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినట్లు ఇందులో ఉంది. ఇతర అకౌంట్లకు మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లు చూపించింది. ఆ మెసేజ్‌ చూసి ఆయన ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాస్కర్ మండల్ అకౌంట్‌కు రూ. 12 లక్షలు, అవిజిత్ గిరి అకౌంట్‌కు రూ. 4.6 లక్షలు, మరో రెండు ఇతర అకౌంట్లకు రూ. 10 లక్షల చొప్పున ట్రాన్స్‌ఫర్ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మిగతా అకౌంట్ ఇతర బ్యాంక్ అకౌంట్లకు చేరింది.

ఝార్కండ్‌లోని జంతారా నుంచి ఈ మోసం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సిమ్ స్వాప్ టెక్నిక్ ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉండొచ్చని పేర్కొంటున్నారు. అలాగే ఫోన్ హ్యాకింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కచ్చితంగా ఈ మోసం ఎలా జరిగిందో పోలీసులు ఇంకా కనుగొనలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మోరల్‌ ఆఫ్‌ దీ న్యూస్‌ ఏంటంటే.. తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చి కట్‌ అయితే.. మనం అత్యుత్సాహానికి పోయి రిటర్న్‌ కాల్‌ చేయొద్దు. ఒకవేళా అలా చేయాల్సి వస్తే.. ఫోన్‌లో నెట్‌ ఆఫ్‌ చేసి చేయడం ఉత్తమం.. ఏది ఏమైనా బ్యాంక్‌ అకౌంట్‌లో ఎక్కువ మొత్తంలో మనీ ఉంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news