అమరావతిలోనే పూర్తి రాజధాని విషయం రోజు రోజుకీ హీటెక్కుతున్నట్లుగానే ఉంది. ఈ క్రమంలో వైకాపా – టీడీపీ మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే… బంతి అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ మెడకు చుట్టుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం బీజేపీ ద్వంద్వ వైఖరే అని అంటున్నారు. ఈ విషయంలో పురందేశ్వరి కూడా తన స్టాండ్ చెప్పేశారు!
అమరావతిలోనే రాజధాని ఉండాలా, మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ వికేంద్రీకరణ దిశగా ముందుకు వెళ్లాలా అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని బీజేపీ నేతల్ జీవీఎల్ చెబుతుంటుండగా… ఈ విషయం ఇంకా ఏపీ అసెంబ్లీలో తీర్మానం కాలేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు! ఈ విషయంలో నిజంగా బీజేపీ స్పందించాలని అనుకుంటే… తమ పార్టీ స్టాండ్ ఏమిటనేది స్పష్టం చేయాలనేది గట్టిగా వినిపిస్తున్న మాట!
ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా పురందేశ్వరి స్పందించారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి మొదలుపెట్టిన పురందేశ్వరి… బీజేపీ తొలి నుంచీ అమరావతికి అనుకూలంమే అని చెప్పేస్తున్నారు. దీన్ని ఆమె వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలి కాబట్టి… ఈ విషయంలో మాత్రం పురందేశ్వరి.. చంద్రబాబు వైపే మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
కాగా.. అమరావతిని తీసెయ్యడం లేదు.. అక్కడ లేకుండా చేయడం లేదు.. కాకపోతే ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కూడా రాజధానిలో వాటా ఇస్తున్నామని.. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం వాదిస్తోన్న సంగతి తెలిసిందే!