దర్శిలో వైసీపీ వర్గపోరు శృతిమించి సవాళ్లకు చేరిందే

-

ప్రకాశం జిల్లా దర్శిలో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు స్థానిక వైసీపీ నేతలు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా ఇద్దరు నేతలు దర్శిలో బల ప్రదర్శనకు దిగారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకున్నారు.

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా మరో సారి బయటపడ్డాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య నిన్నటి వరకూ చాపకింద నీరులా ఉన్న వివాదం ఇప్పుడు బజారు కెక్కింది. సీఎం జగన్ పుట్టిన వేడుకలు నిర్వహించేందుకు గత పది రోజులు ముందు నుండే నాయకులు ఇద్దరూ పోటీపడుతున్నారు. నేతలిద్దరూ దర్శిలో భారీగా తరలివచ్చిన తమ వర్గీయులతో ర్యాలీలు చేశారు. వేరువేరుగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

సీఎం జగన్ పుట్టిన వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒక అడుగు ముందుకేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై ఫైర్ అయ్యారు. దర్శిలో బూచేపల్లి పోటీ చేయలేక వెళ్లిపోతే తాను నిలబడ్డానని, ఎవరి సీటు తాను లాక్కోలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక దర్శిలో పెత్తనం కోసం బూచేపల్లి వస్తున్నాడని ఆరోపించారు. తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే ఇకపై సహించనని అన్నారు. సాఫ్ట్ వేర్ వాడే కదా…సాఫ్ట్ గా ఉంటానని అనుకుంటున్నారేమో…వెనుక బండరాయి అంత గుండె ఉందంటూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఫైర్ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే మద్దిశెట్టిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పదవి నాకు కొత్తకాదు..నేను చెయ్యని పదవి లేదన్నారాయన. సీఎం జగన్ ఎవరిని సపోర్ట్ చెయ్యమంటే వారిని సపోర్టు చేస్తానే తప్ప..తనకు కొత్త ఎజెండా లేదన్నారు. నమ్ముకున్న మనుషుల కోసం ఎంత కష్టమైనా భరిస్తానని చెప్పారు. బూచేపల్లి కుటుంబం జగన్ కుటుంబానికి సేవకులమేనని అన్నారు. ఏ పని చేసినా సమాజశ్రేయస్సు కోసమే తప్ప..దాచుకోవడానికి దోచుకోవడానికి కాదంటూ మద్దిశెట్టి వేణుగోపాల్‌పై సెటైర్లు వేశారు.

మద్దిశెట్టి, బూచేపల్లి బజారుకెక్కి సవాళ్లు విసరడంతో..దర్శి రాజకీయం హీటెక్కింది. అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులకు అవకాశం ఇస్తారో లేదో అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news