గొల్లపూడి మండల్ లెవల్ స్టాక్ పాయింట్‌ను పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు.రేషన్ సరకుల్లో నాణ్యతా లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇలాంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెుదట గోడౌన్లో సరకులు, వాటి రికార్డుల జాబితాలను మంత్రి నాదెండ్ల పరిశీలించారు.
పంచదార, నూనె అరకిలో ప్యాకెట్లను తూకం పెట్టించగా.. ప్రతి ప్యాకెట్లో 20నుంచి 50 గ్రాముల వరకు తక్కువుగా ఉండటంపై ఆయన మండిపడ్డారు. కిలో కంది పప్పు ప్యాకెట్ కూడా 50గ్రాములు తక్కువుగా ఉన్నట్లు అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు పంపిణీ చేసే సరకుల నాణ్యత లోపంపై మంత్రి ధ్వజమెత్తారు. ప్రజలు తినేందుకు ఇచ్చే ఆహార పదార్థాలు ఇంత ఘోరంగా ఉన్నాయా …వీటిని వెనక్కి పంపించకుండా ఎలా పంపిణీ చేస్తున్నారంటూ మంత్రి మనోహర్ ఫైర్ అయ్యారు. సరకు మొత్తాన్ని వెంటనే వెనక్కి పంపించాలని ఆయన ఆదేశించారు. నాణ్యమైన సరకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.