ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

-

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల ముందు మాత్రమే దర్శనమివ్వనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఒక్క రఅడుగుతో మొదలైన ఖైరతాబాద్‌ మహా గణపతి ప్రస్థానం ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఈసారి 68వ సంవత్సరం సందర్భంగా శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ నేతృత్వంలో మహాగణపతి విగ్రహం రూపు దిద్దుకోనుంది. తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మేర మట్టితో తయారుచేస్తున్న శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి నిల్చున్న ఆకారంలో ఉంటాడు. పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహాగణపతి పక్కనే కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు మరో పక్క మూషికం ఉంటాయి. అయిదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో అద్భుతంగా దర్శనమిచ్చే విధంగా డిజైన్‌ చేస్తున్నారని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

మహాగణపతికి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. గతంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారయ్యే గణపతిని… పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి రాజస్థాన్ నుంచి బంకమట్టి తీసుకువచ్చి మట్టితోనే మహాగణపతిని తయారుచేస్తున్నారు. జాన్ 10న కర్రపూజ తర్వాత మహాగణపతి విగ్రహ తయారీపనులు ప్రారంభమయ్యాయి.

మొదట ఐరన్‌ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్‌ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్‌ చుట్టూ ఔట్‌ లుక్‌ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు. ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్‌ పనులు పూర్తి చేసి.. వాటర్‌ పెయింట్స్‌ వేయడంతో మట్టి వినాయకుడి విగ్రహం పూర్తి స్థాయిలో తయారవుతుంది.

రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న కారణంగా ఈ సంవత్సరం వినాయకుని విగ్రహం తయారీకి కొంచెం ఆలస్యమైందని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 31 నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయని నవరాత్రులకు రెండు రోజుల ముందు నుంచే వినాయక విగ్రహం పూర్తవుతుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news