బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించి ఎయిమ్స్‌ మార్గదర్శకాలు ఇవే..!

-

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో కొంతమంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్న విషయం తెల్సిందే. మహారాష్ట్ర, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. రాజస్థాన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలో కూడా చేర్చారు. ఈ తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్‌ బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పలు సూచనలు చేసింది.

ఎక్కువగా స్టెరాయిడ్స్‌ తీసుకొనేవారితో పాటు చాలా కాలంపాటు స్టెరాయిడ్స్‌ తీసుకొనేవారు ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నారని ఎయిమ్స్‌ తెలిపింది. మధుమేహం అదుపులో లేనివారికి, రోగ నిరోధక మందులు, యాంటీ క్యాన్సర్‌ చికిత్స తీసుకొనేవారికి, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి ఈ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. అలానే కరోనా లక్షణాలు అధికంగా ఉండి వెంటిలేటర్‌ మీద చికిత్స పొందిన వారు అధిక శాతం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కంటినొప్పి, కంటి చుట్టూ వాపు, ఎర్రగా అవడం, దృష్టి కోల్పోవడం, కన్ను మూసి తెరవడంలో ఇబ్బందులు ఏర్పడడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపింది. అలానే ముఖం తిమ్మిరిగా అనిపించడం, ముక్కు నుంచి నల్లటి స్రావాలు , రక్తం కారడం, నోరు తెరవడం, నమలడంలో ఇబ్బందులు తలెత్తడం కూడా కూడా బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు అని వెల్లడించింది. ముఖంలో వాపు రావడం, కంటి కింద, ముక్కు, చెంపల భాగాల్లో నలుపు రంగు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో లేదో అని ఎవరికి వారు తరచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని సూచించింది.

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలని ఎయిమ్స్‌ సూచించింది. వైద్యులు సూచించిన మండులనే వాడాలని సొంతవైద్యం చేసుకోకూడదని హెచ్చరించింది. రక్తంలో గ్లూకోజ్‌ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news