ఐఐటీ ఢిల్లీ అభివృద్ధి చేసిన కరోనా పరీక్ష కిట్ బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. ఢిల్లీకి చెందిన ‘న్యూటెక్ మెడికల్ డివైజెస్’ కంపెనీ దీన్ని ‘కోరో ష్యూర్’ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. కిట్ తయారీ కోసం తమ నుంచి నాన్-ఎక్స్‌క్లూజివ్ ఓపెన్ లైసెన్సులు పొందిన కంపెనీలకు ఐఐటీ ఢిల్లీ పెట్టిన షరతు ప్రకారం కిట్ ధర రూ.500కు మించకూడదు. దీంతో ఈ కిట్ ధర కూడా 500లోపే ఉండొచ్చని తెలుస్తుంది. లాంఛనంగా ఈ పరికరాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి సంజయ్ ధోత్రేలు విడుదల చేస్తారు. తక్కువ ధరలకు దొరికే ఈ టెస్టు కిట్‌తో దేశంలో వైరస్ పరీక్షల దిశలో సరికొత్త దశ ఆరంభం అవుతుందని.
దీని సైజ్, ధరల కోణంలో చూస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ఐఐటి వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ దేశంలో ఉన్న పలు కోవిడ్ పరీక్షల విధానాలు అన్నీ కూడా పలు రకాల ఇతరత్రా పరీక్షలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఈ పరికరం ద్వారా వేరే పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే వైరస్ నిర్థారణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, వైరస్ సోకిందీ లేనిదీ నిర్థిష్టంగా తక్కువ వ్యయంతోనే కనుగొనవచ్చునని ఐఐటి ఢిల్లీ వర్గాలు తెలిపాయి.