కరోనా ధాటికి ఎక్కువగా కుదేలైన రాష్ట్రం ఏది అనే విషయం వస్తే మహారాష్ట్ర పేరే ముందు వరుసలో ఉంటుంది. మొదటి వేవ్ నుండి మొదలుకుని రెండవ వేవ్ వరకు కరోనా రక్కసి మహారాష్ట్రని గజగజ వణికించింది. ముఖ్యంగా ముంబైలో కరోనా విలయతాండవం చేసింది. ఐతే ఇప్పుడిప్పుడే కరోనా నుండి ముంబై కోలుకుంటుంది. కేసులు తగ్గుతున్నాయని సంతోషపడుతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడకుండా డెంగ్యూ జ్వరం డేంజర్ బెల్స్ మోగిస్తుంది.
రోజు రోజుకీ డెంగ్యూ బాధితులు పెరుగుతున్నారు. గత ఏడాది ముంబైలో 129కేసులు నమోదవగా, ఈ ఏడాది 305కి పైగా కేసులు వచ్చాయి. ఒక్క ఆగస్టులోనే 140డెంగ్యూ కేసులు రాగా, సెప్టెంబరులో 85కేసులు వచ్చాయని బృహన్ ముంబై కార్పోరేషన్ వెల్లడి చేసింది. ఐతే గత ఏడాది డెంగ్యూతో 3మరణాలు నమోదయ్యాయి. అదృష్టవశాత్తు ఈ సారి ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. దోమలు పెరగకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని బృహన్ ముంబై సూచనలు చేసింది.