సింగరేణి బొగ్గు గనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి కీలక ఆదేశాలు ఇచ్చారు. సచివాలయంలో సింగరేణి అధికారుల తో బొగ్గు గనుల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు..మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.
నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో, సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
హై టెన్షన్ విద్యుత్తు లైను ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ తో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు. పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్.పి.డి.ఏ.సి. మీటింగ్ ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు.