ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీకి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మిగతా ప్రాంత ప్రజలు జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. తాను దీక్ష ప్రారంభించిన విషయాన్ని ఉమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమరావతి ప్రాంత రైతులతో కలిసి గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రివర్యులు దీక్ష చేస్తున్నారు.
అమరావతిని ప్రజా రాజధానిగా సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అలాగే కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పుణ్యస్థలంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అమరావతి రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉమ చేస్తున్న దీక్ష కొనసాగుతోంది.