టికెట్ల బుకింగ్ నిలిపివేయండి.. డీజీసీఏ ఆదేశాలు

-

విమాన సర్వీసులకు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని విమానయాన సంస్థలు టికెట్ బుకింగ్‌లు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదివారం సర్క్యులర్ వెలువరించింది. మే 4 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల కార్యకలాపాలను ప్రారంభించే నిర్ణయం ఇంకా తీసుకోలేదని విమానయాన సంస్థల దృష్టికి తీసుకువచ్చింది. డీజీసీఏ నుంచి విమాన సర్వీసులు ప్రారంభంపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు టికెట్ బుకింగ్స్ నిలిపివేయాలని కోరింది.

“ఏప్రిల్ 14వ తేదీన డీజీసీఏ విడుదల చేసిన సర్క్యులర్‌లో మే 3వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నాం. కానీ అందులో మే 4 నుంచి టికెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని ఎలాంటి సూచనలు గానీ, అనుమతులు ఇవ్వలేదు. కానీ పలు ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభించాయని తెలిసింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను మే 4వ తేదీ నుంచి ప్రారంభించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని స్పష్టం చేసింది.

అయితే ఎంపిక చేసిన రూట్లలో మే 4 నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని, జూన్‌ 1 నుంచి ఇంటర్నేషనల్‌ బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ టికెట్ల బుకింగ్ నిలిపివేయాలని జారీచేసిన ఆదేశాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news