DGCA : ఆర్థిక నేరగాళ్లకు చెక్‌.. ప్రతి విమాన సంస్థ ఆ జాబితా ఇవ్వాల్సిందే

-

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ.. ఇలా దేశంలో ఆర్థిక నేరగాళ్లకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారెందరో. వారు చేసిన మోసం వెలుగుచూసేలోపే వారు విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి విమానయాన సంస్థా విదేశీ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాలని స్పష్టంచేసింది. పేరు, కాంటాక్ట్‌ వివరాలు సహా పేమెంట్స్‌ వివరాలు కూడా ఇవ్వాలని సూచించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రయాణికుల వివరాల సేకరణకు గల కారణాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొననప్పటికీ.. ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా నిలువరించేందుకేనని తెలుస్తోంది. కస్టమ్స్‌ బోర్డు ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. కస్టమ్స్‌ యాక్ట్‌ కింద నేరగాళ్ల నిరోధం, గుర్తింపు, విచారణకు ఉపయోగించుకోవడంతో పాటు ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలు, ఇతర దేశాలతోనూ ఈ వివరాలు పంచుకోనున్నట్లు సీబీఐసీ పేర్కొంది. దీనిద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న 60 దేశాల జాబితాలో భారత్‌ సైతం చేరింది.

నోటిఫికేషన్‌ ప్రకారం.. విమాన టికెట్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణికుల నుంచి సేకరించే వివరాలను ప్రతి విమాన సంస్థా పంచుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లే, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికుల వివరాలను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికుడి పేరు, బిల్లింగ్‌ వివరాలు (క్రెడిట్‌కార్డు నంబర్‌), టికెట్‌ జారీ చేసిన తేదీ, ప్రయాణ ఉద్దేశం, అదే పీఎన్‌ఆర్‌ నంబర్‌పై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, ఇ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, ట్రావెల్‌ ఏజెన్సీ, బ్యాగేజీ వివరాలు వంటివి కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా సేకరించిన వివరాలను కస్టమ్స్‌ రికార్డుల్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా విమాన సంస్థ ఈ నిబందనలు పాటించకపోతే గరిష్ఠంగా రూ.50వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ నిబంధన 2017 బడ్జెట్‌ సందర్భంగా ప్రతిపాదించినప్పటికీ.. తాజాగా అమలులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version