డైలాగ్ ఆఫ్ ద డే : వార‌ణాసి దారుల్లో తెలంగాణ చంద్రుడు

-

కోరిన వరాలు ఇచ్చే కైవ‌ల్య ధామం ద‌గ్గ‌ర కైలాస క్షేత్రం ద‌గ్గ‌ర ఇంకా చెప్పాలంటే విశ్వాసాల‌కు ఆన‌వాలుగా నిలిచే క్షేత్రం ద‌గ్గ‌ర కేసీఆర్ ఉండ‌నున్నారు. త్వ‌ర‌లో అక్క‌డికి వెళ్లి త‌న గొంతుక వినిపించ‌నున్నారు. హిందుత్వం అనే అజెండాతో బీజేపీ వెళ్తున్న తీరును ఆయ‌న ఇప్ప‌టికే ప‌దే ప‌దే విమ‌ర్శించారు. తాను మ‌తాన్ని ఆచ‌రిస్తానని ఇత‌రుల విశ్వాసాల‌కు భంగం క‌లిగించ‌న‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సామ‌ర‌స్య పూర్వ‌క ధోర‌ణి వ‌దులుకోన‌ని గ‌తంలో కేసీఆర్ చెప్పారు.

ఆ ఆచారానికి ఆ నిబ‌ద్ధ‌త‌కూ తార్కాణ‌మే త‌న హ‌యాంలో పునఃనిర్మించిన యాదాద్రి.. అని కూడా చెప్ప‌నున్నారు. శైవ క్షేత్రాన వైష్ణవ కీర్త‌న వినిపించేందుకు కూడా ఆయ‌న సిద్ధం అవుతున్నారు. అద్వైత భావ‌జాలాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు అని కూడా తెలుస్తోంది. కేసీఆర్ రాక‌తో అక్క‌డున్న తెలుగు వారి కుటుంబాల‌కు కూడా పండుగే! అందుకు ఈ నెల నాలుగు సుముహూర్తం.

కాశీకి పోయాను రామా హ‌రి గంగ తీర్థ‌మ్ము తెచ్చాను రామా హ‌రి ! అని పాడుకోవ‌డంలో అర్థం ఉంది.గంగా జ‌ల క్షేత్రాన పావ‌న రంజ‌కం కొన్ని.పుణ్య ధామం చెంత అమూల్యం అతి భ‌ద్రం మ‌రికొన్ని. హిందుత్వ నినాదాలు పంచాక్ష‌రీ స్మ‌ర‌ణ‌లు నిత్య కీర్త‌నల్లో భాగం అయి న‌డిచే వేళ‌ల్లో పుణ్య వార‌ణాసి పూజ్య క‌ల్వ‌కుంట్ల చంద్ర శేఖ‌ర్ రావును ఏ విధంగా చూసుకుంటుంది. కాశీ అన్న‌పూర్ణమ్మ దీవెన‌లు ఎవ‌రికి? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌రో కొత్త పరిణామం. మోడీ ప్ర‌భావం కొంత వ్య‌తిరేక‌త కొంత కార‌ణంగా ఎవ్వరు ఎటువైపు అన్న‌ది ఓటరు నిర్ణ‌యం. కానీ కేసీఆర్ మాత్రం త‌న ప్ర‌భావంతో ఇక్క‌డి నుంచే శంఖారావం పూరించాల‌న్న సంక‌ల్పంతో ఉన్నారు.

ఒక‌ప్పుడు పార్టీ ఆఫీసుకు కూడా చోటు లేని రోజు త‌న‌కు గుర్తు ఉంద‌ని అలాంటిది దేశ రాజ‌ధానిలో అతి పెద్ద భ‌వంతిని నిర్మించే శ‌క్తి త‌న‌కు వ‌చ్చింద‌ని,ఇదే గొప్ప విజ‌యానికి సంకేతం అని త‌రుచూ కేసీఆర్ అంటుంటారు.అదేవిధంగా వార‌ణాసి వీధుల్లో కేసీఆర్ కు కూడా ఆ రోజులు గుర్తుకు రావాలి.ఆ రోజు ఏమీ లేని రోజు అంటే రాజకీయంగా పెద్ద‌గా ప్రాభావిక స్వ‌రం వినిపించ‌లేని రోజు, చంద్ర‌బాబును వ‌ద్ద‌నుకుని ఇటుగా వ‌చ్చిన రోజు ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఆరంభించి స‌క్సెస్ అయ్యారు.ఇవాళ ఆంధ్రాలోనూ ఆయ‌న‌కు అభిమానులు ఉన్నారు.

ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న భోళా మ‌నిషి. పెద్ద‌గా కోపాలు తాపాలు ఉంచ‌ని మ‌నిషి.మోడీ అంతగా కాకున్నా హిందుత్వాన్ని వినిపిస్తారు కానీ రాజ‌కీయం చేయ‌రు… అని అంటారు పరిశీల‌కులు.మ‌త‌తత్వ రాజ‌కీయాలకు దూరంగా ఉంటూ ఇంత‌కాలం కేసీఆర్ ప‌నిచేశారు. ఇక‌పైకూడా అలానే ఉంటారు.అందుకు ఈ నెల నాలుగున వారణాసిలో నిర్వ‌హించే స‌భ‌లో కేసీఆర్ చెప్పే మాట‌లే ఆ ధార్మిక జ‌గ‌తి చెంత త‌ప్ప‌క నిజం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news