ఈ రత్నాలను మంత్రగత్తెలు ధరించేవారు తెలుసా..!

-

పూర్వ కాలంలో రత్నాలు ఎక్కవగా వాడుకలో ఉండేవి. మరికొంత మంది వారు పుట్టిన రాశి, నక్షత్రం బట్టి రత్నాలను ధరించేవారు. ఇక సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాయనే నమ్మకంతోనే ప్రాచీనులు రత్నాలను ధరించేవారు. దోషభరితమైన రత్నాలను ధరించినప్పుడే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు. దోషాలు లేకుండా ఎలాంటి రత్నమైనా ధరించదగ్గదేనని భావించేవారు. దోషాలతో నిమిత్తం లేకుండా ప్రాచీనులలో కొందరిని భయపెట్టిన రత్నం ఒకటి ఉండేది. అదే ‘ఓనిక్స్‌’.

అయితే ఓనిక్స్‌ ని పురాతన సంస్కృత గ్రంథాలు దీనిని గోమేధకభేదంగా, శివధాతువుగా, పీతరత్నంగా పేర్కొన్నాయి. ‘ఓనిక్స్‌’ జాతికే చెందిన ‘హేసొనైట్‌ సార్డోనిక్స్‌’ను మన ప్రాచీనులు ‘గోమేధికం’గా నవరత్నాల జాబితాలో చేర్చారు. ప్రాచీన చైనా ప్రజలు ‘ఓనిక్స్‌’ రత్నాలను దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. ముఖ్యంగా గాఢమైన నలుపు రంగులోని ఓనిక్స్‌ రత్నాలను ధరించడానికి వెనుకాడేవారు. విశేషమేమిటంటే, విదేశాలకు నౌకలలో వెళ్లే చైనా వర్తకులు మిగిలిన రత్నాలతో పాటు ఓనిక్స్‌ రత్నాలతోనూ వ్యాపారం చేసేవారు. మిగిలిన రత్నాలను తిరిగి వచ్చేటప్పుడు స్వదేశానికి తీసుకొచ్చేవారు గాని, ఓనిక్స్‌ రత్నాలను స్వదేశానికి రాక ముందే అయినకాడికి అమ్మేసేవారు.

ఇక నలుపు రంగు ఓనిక్స్‌కు అరబిక్‌ భాషలో ‘ఎల్‌ జజా’ అనే పేరు ఉంది. అంటే, విషాదం అని అర్థం. విక్టోరియన్‌ కాలంలో బ్రిటన్‌లో ప్రముఖుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు జెట్‌తో పాటు నలుపు రంగు ఓనిక్స్‌తో తయారైన ఆభరణాలను సంతాప సూచకంగా ధరించేవారు. ఇది జీవనోత్సాహాన్ని కూడా తగ్గించి, దిగులు గుబులు పెంచుతుందని చాలామంది ఈ రత్నాన్ని ధరించడానికి భయపడేవారు. నల్లని ఓనిక్స్‌ రత్నాలకు ప్రేతాత్మలను ఆకర్షించే లక్షణం ఉందనే నమ్మకం కూడా అప్పట్లో బలంగా ఉండేది. ఓనిక్స్‌ రత్నాలకు సంబంధించి కొన్ని సానుకూల నమ్మకాలు కూడా ఉండేవి.

అంతేకాదు.. ప్రాచీనకాలం నుంచి వివిధ దేశాల్లో ఓనిక్స్‌ రత్నాలు వాడుకలో ఉన్నప్పటికీ, వీటి శిల్పాలు, గృహోపకరణాలతో పోల్చితే, ఆభరణాల్లో వీటి వినియోగం చాలా తక్కువగానే ఉండేది. నల్లని ఓనిక్స్‌ రత్నాలకు పూసల్లా రంధ్రాలు చేసి, వాటిని కూర్చిన దండలను ప్రాచీన, మధ్యయుగాల కాలంలో ఎక్కువగా మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు. ఆధునిక ఫ్యాషన్‌రంగంలో మార్పులు మొదలైన తర్వాతనే జనాలు ఓనిక్స్‌ రత్నాలను కాస్త ధైర్యంగా ఆభరణాల్లో ధరించడం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news