ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసిన విషయం విదితమే. మన దేశంలో ఒక వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరిట విక్రయిస్తున్నారు. ఇక ఇంకో వ్యాక్సిన్‌ను ఇతర దేశాల్లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (సీహెచ్ఏడీఓఎక్స్1) పేరిట విక్రయిస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లలో దేన్ని తీసుకున్నా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు వ్యాక్సిన్లు కొత్త రకం కరోనా వేరియెంట్‌పై పనిచేయడం లేదని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.
సౌతాఫ్రికాకు చెందిన బి.1.351 కరోనా వేరియెంట్ ఆ రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లను కూడా తట్టుకుని జీవించగలుగుతుందని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు వారు 42 మందికి ఆ రెండు వ్యాక్సిన్లు ఇచ్చి పరీక్షించారు. రెండు డోసులను తీసుకున్న తరువాత కూడా ఆ రెండు వ్యాక్సిన్లు ఆ కోవిడ్ వేరియెంట్‌పై ప్రభావం చూపలేకపోతున్నాయని నిర్దారించారు. జూన్ 24 నుంచి నవంబర్ 2020 మధ్య ఈ పరిశోధన చేపట్టారు.
సైంటిస్టులు చేపట్టిన ఈ పరిశోధనకు చెందిన వివరాలను ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లోనూ ప్రచురించారు. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్న సౌతాఫ్రికా ఇటీవలే వాటిని వెనక్కి తీసుకోవాలని పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థను కోరింది. కానీ మన దేశంలో ఈ వ్యాక్సిన్ బాగానే పనిచేస్తుందని సైంటిస్టులు తెలిపారు.