పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన ఆయన.. ప్రజలకు ఇచ్చే కందిపప్పు,పంచదార, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు. తూకం తేడాలపై సంబంధింత అధికారులు, డీలర్లపై ఫైర్ అయ్యారు.
తాజాగా ఆయన రాష్ట్రంలోని బియ్యం, కందిపప్పు, పంచదార వ్యాపారులతో ధరల నియంత్రణపై ఆయన సమావేశం నిర్వహించారు. వారికి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు గురించి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరల పెరుగుదలపై ఆరా తీశారు. మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.