హిందూ సాంప్రదాయంలో కుంకుమ పెట్టుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. పెళ్లిలో కానీ, దైవ సంబంధ కార్యంలో కానీ ఇంకా అనేక సందర్భాల్లో కుంకుమను నుదుటన పెట్టుకుంటారు. కొందరు క్రమం తప్పకుండా రోజు స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకుంటారు.
కుంకుమ కూడా రకరకాలుగా మారింది. కొందరు ఆడవాళ్లు ముఖ్యంగా యువత కుంకుమ స్థానంలో బొట్టు బిళ్ళలు పెట్టుకుంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం కుంకుమ గురించి మాట్లాడుకుందాం.
ఈ కుంకుమను ఏ వేలితో పెడుతున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కో సందర్భంలో ఒక్కో వేలితో కుంకుమను పెట్టాలి. ఏ వేలితో పెడితే ఏమి అర్థం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బొటన వేలితో కుంకుమ పెడితే.. విజయాన్ని సాధించుకు రమ్మని ప్రోత్సహించినట్టు అర్థం వస్తుంది. అందుకే దీనిని వీర తిలకం అంటారు. మీరు గమనించినట్లయితే చాలా సినిమాల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు బొటనవేలుతోనే నుదుటన కుంకుమ పెడతారు.
ఇక చూపుడు వేలుతో కుంకుమను ప్రాణం ఉన్న జీవులకు పెట్టకూడదు. ప్రాణం లేని వస్తువులకు చూపుడు వేలుతో కుంకుమను పెట్టవచ్చు.
మధ్య వేలితో కుంకుమను పెడితే… ఎక్కువకాలం జీవించమని అర్థం. అలాగే ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి భయాలు కలగకూడదని కోరుకున్నట్టు అర్థం.
ఇక ఉంగరపు వేలితో బొట్టు పెడితే.. శాంతి, తెలివి సమకూరాలని అర్థం. చాలామంది మామూలు సందర్భాల్లో ఉంగరపు వేలితోనే బొట్టు పెడతారు. జీవితంలో ఎదగాలంటే తెలివి, శాంతి రెండూ ఉండాలి. తెలివి ఉండి, మనస్సుకు శాంతి లేకపోతే మనిషి ఎదగలేడు.