రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం ట్రబుల్షూటర్ దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతున్నారు. పీసీసీని వ్యతిరేకించిన సీనియర్ నేతలతో.. ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. వి.హనుమంతరావు, మల్లు రవి, శ్రీధర్‌బాబు, మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితర నేతలు గాంధీభవన్‌కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలకు సమయం కేటాయించారు.
పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకులంతా ఏకతాటిపై నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్ల్లో పోస్టులు పెడుతూ సీనియర్లను అవమానపరుస్తున్న వైనం, కొందరు నాయకులు కోవర్టులుగా పని చేస్తూ.. పార్టీని దెబ్బతీస్తున్నట్లు సీనియర్ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై కూడా దిగ్విజయ్‌సింగ్ చర్చిస్తున్నట్లు సమాచారం.