- కన్నడిగుల భాషాభిమానం ఎంతో గొప్పది
- ఆ మాటకు వస్తే దక్షిణాదిలో తమిళల భాషాభిమానం
- ఇంకా ఇతర భాషలు మాట్లాడే వారి మాతృభాషాభిమానం
ఎంతో గొప్పవి.. ఒక్క తెలుగు వారే ఇందులో వెనుకబడి ఉన్నారన్నది ఓ వాస్తవం.తాజా వివాదం నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ కన్నడిగుల కోపానికి కారణం అయింది. ఆ రోజు బన్నీ (పుష్పకు సంబంధించి) ఇప్పుడు తారక్ తమ అభిమానుల ఆగ్రహానికి గురై ఇబ్బందుల్లో పడ్డారు. ఎట్టకేలకు వివాదం పరిష్కారం కావడంతో కథ కాస్త సుఖాంతం కానుంది. ఆ వివరం ఈ కథనంలో…
పుష్ప మొదలుకుని ట్రిపుల్ ఆర్ దాకా అనేక వివాదాలు కన్నడ సీమ చుట్టూనే తిరుగుతున్నాయి. పుష్ప సినిమా విషయమై కూడా కన్నడ వెర్షన్ కాకుండా తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్లు విడుదల చేసేందుకే మూవీ మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపారు. దీంతో భాషాభిమానం ఎక్కువగా ఉండే కన్నడిగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బ్యాన్ పుష్ప మూమెంట్ ను కూడా తీసుకుని వచ్చారు. ఆ వివాదం ఏదో ఒకవిధంగా సద్దుమణిగింది. కానీ కన్నడిగుల కోపం మాత్రం అలానే ఉంది.ఇప్పుడు
ట్రిపుల్ ఆర్ విషయమై కూడా సంబంధిత చిత్ర నిర్మాణ వర్గాలు అదే తప్పు చేస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా ప్రమోషనల్ ఇవెంట్లు అన్నీ భారీగానే చేశారు. బెంగళూరు, చిక్ బల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి సినిమాకో హైప్ తీసుకుని వచ్చారు. చిక్ బల్లాపూర్ (ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతం) లో జరిగిన వేడుకల్లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా కన్నడలో సినిమా విడుదల చేయాలని రాజమౌళిని కోరారు.
కానీ ఆఖరి నిమిషంలో ఎందుకనో ఈ సినిమా కన్నడ వెర్షన్ ను కాదని మిగతా భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ భాగస్వామి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.కన్నడ నాట తెలుగు,తమిళంతో పాటు హిందీ భాషల్లో అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు సమాయత్తం అయి కొత్త వివాదానికి తావిచ్చింది. దీంతో కన్నడిగులకు కోపం తన్నుకువచ్చింది. బ్యాన్ ఆర్ఆర్ఆర్ పేరిట ట్విటర్లో ఓ హ్యాష్ ట్యాంగ్ ను ట్రెండ్ ఇన్ చేశారు.
జాతీయ స్థాయిలో ఈ వివాదంపై మాట్లాడేలా చేశారు. దీంతో దిగివచ్చిన నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ నోట్ విడుదల చేసి ప్రేక్షకుల కోరిక మేరకు వీలున్నంత ఎక్కువ థియేటర్లలో కన్నడ వెర్షన్ ను విడుదల చేస్తామని, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కానీ చరణ్ కానీ కన్నడ వెర్షన్ డబ్బింగ్ చెప్పేందుకు ఎంతో ఆసక్తి,శ్రద్ధ కనబరిచారని, మీ ఆశలకు అనుగుణంగానే మేం నడుచుకుంటామని చెప్పడంతో వివాదం ఆగింది. అయితే ఇదే సమయంలో మరో వివాదం కూడా రేగింది. మీరు ట్రిపుల్ ఆర్ ను బ్యాన్ చేస్తే మేం కేజీఎఫ్ 2ను బ్యాన్ చేయిస్తాం అంటూ మరో వివాదం వచ్చింది. దీంతో చిత్ర వర్గాలు తప్పు దిద్దుకున్నాయి. సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కానుంది.