విభజన రాజకీయాలు దేశానికే ప్రమాదం అని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్యలు దేశ ఐక్యతా భావాలకు పెను సవాల్ విసురుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో ఓ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేసే ఈ రకమైన రాజకీయం సమాజంలో విభజనను పెంచుతుందన్నారు.
విభజన సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయం సోదర భావానికి ప్రమాదమని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవలి కాలంలో అధికార పార్టీ విభజన రాజకీయాలు చేస్తుందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు పెద్దఎత్తున ఆరోపించిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కామెంట్స్ సంచలనంగా మారాయి.