కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి జనాలు దాని పట్ల తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులకు కరోనా వచ్చినా ఏమీ కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ జనాలు భయపడుతూనే ఉన్నారు. ఇక కరోనా వైరస్ పలు ఉపరితలాలపై కొన్ని గంటలు, రోజుల వరకు అలాగే ఉంటుందని గతంలో కొందరు సైంటిస్టులు చెప్పారు. దీంతో బయటకు వెళ్లినప్పుడు ఎక్కడ దేన్ని టచ్ చేయాలన్నా భయపడుతూనే ఉన్నారు. ఇక కరెన్సీ నోట్ల సంగతి సరే సరి. వాటిని తీసుకునేందుకు కూడా జనాలు వెనుకాడుతున్నారు.
అయితే కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అందువల్ల భయపడాల్సిన పనిలేదని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వారు ఒక అధ్యయనం చేపట్టారు. కరెన్సీ నోట్లపై కరోనా వచ్చిన వారు దగ్గినా, తుమ్మినా ఆ వైరస్ ఒక గంటలో పూర్తిగా నశిస్తుందని, 6 గంటల తరువాత కేవలం 5 శాతం వైరస్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుందని, అయినప్పటికీ ఆ వైరస్ బలహీనమవుతుందని, కనుక కరెన్సీ నోట్లను ముట్టుకున్నా ఏమీ కాదని, దాంతో భయ పడాల్సిన పనిలేదని అంటున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఇక వివిధ ఉపరితలాలపై కరోనా ఉంటే.. వాటిని మనం టచ్ చేస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందా, లేదా.. అన్న విషయంపై ఇప్పటి వరకు ఏ సైంటిస్టూ ప్రయోగం చేయలేదు. కాకపోతే ఏయే ఉపరితలంపై కరోనా వైరస్ ఎంత సేపు ఉంటుంది ? అనే విషయాన్ని మాత్రమే చెప్పారు. ఈ క్రమంలో ఈ విషయంపై కూడా ఎవరైనా సైంటిస్టులు ప్రయోగం చేసి విషయాన్ని చెబుతారేమో చూడాలి.