భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. సదరు యాప్‌లను ప్రస్తుతం గూగుల్, యాపిల్‌లు తమ తమ యాప్ స్టోర్‌ల నుంచి కూడా తొలగించాయి. ఈ క్రమంలో ఆ యాప్‌లన్నీ ఇప్పుడు భారత్‌లో పనిచేయడం లేదు. అయితే బ్యాన్ చేయబడిన యాప్‌లలో వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ కూడా ఉంది. ఇండియాలో ఈ యాప్ బ్యాన్ అవడం వల్ల ఈ యాప్‌కు చెందిన మాతృ కంపెనీ బైట్ డ్యాన్స్ లిమిటెడ్‌కు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. మొత్తం 6 బిలియన్ల డాలర్ల వరకు ఆ కంపెనీకి ఈ బ్యాన్ వల్ల నష్టం కలుగుతుందని తేలింది.
బీజింగ్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. టిక్‌టాక్ యాప్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ లిమిటెడ్‌కు టిక్‌టాక్ యాప్ బ్యాన్ వల్ల 6 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. టిక్‌టాక్‌కు ఇండియాలో 2000 మంది ఫుల్ టైం సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక ఈ యాప్‌ను ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఏకంగా 611 మిలియన్ల సంఖ్యలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే టిక్‌టాక్‌కు యూజర్లు ఎక్కువగా ఉన్నారు.
2019 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయిన టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో 30.3 శాతం డౌన్‌లోడ్లు భారత్‌లోనే చోటు చేసుకోవడం విశేషం. దీన్నిబట్టే చెప్పవచ్చు.. భారత్‌లో టిక్‌టాక్‌ను ఎంత మంది వాడుతున్నారో. ఇక ఆదాయం పరంగానూ టిక్‌టాక్‌కు భారత్ నుంచే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో నిషేధం వల్ల టిక్‌టాక్ ఆ ఆదాయం మొత్తాన్ని కోల్పోనుంది. అయితే గతంలో టిక్‌టాక్ కేవలం కొద్ది రోజుల పాటు మాత్రమే బ్యాన్ అయిందని, కానీ ఇప్పటి బ్యాన్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేమని, బహుశా నిషేధం ఎక్కువ రోజుల పాటు కొనసాగవచ్చని నిపుణులు అంటున్నారు.