మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మెన్ మోకా భాస్కర రావు ను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు నిన్న రాత్రి తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద అరెస్టు చేసి, విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై పోలీసులు నేడు ఉదయం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు.
మోకా భాస్కర రావును ప్లాన్ ప్రకారమే హత్యచేశారని ప్రధాన నిందితుడు నాంచారయ్య అలియాస్ చిన్నా ఒప్పుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ హత్యకు కొల్లు రవీంద్రతో సంబంధం ఉన్న విషయం వాస్తవమే అని చిన్నా అంగీకరించాడు. మోకా భాస్కర రావు కు కొల్లు రవీంద్రకు విభేదాలు ఉండటం వాస్తవం అని ఇరువురి మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో భాస్కర రావును చంపేందుకు డిసైడ్ అయ్యారని ఆయన చెప్పాడు. ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని హత్య జరిగిన తీరును చిన్నా పోలీసులకు వివరించాడని అధికారులు స్పష్టం చేశారు. హత్య జరిగే నాలుగు రోజుల ముందు కొల్లు రవీంద్ర చిన్నాతో తన పేరును బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పినట్టు చిన్నా అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కొల్లు రవీంద్ర కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు.