భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా ఎర్రకోటపై ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అందరి దృష్టి దానిపై పడింది. అయితే ఇంతకీ ఈ పరికరం ఏమిటి ? దీని ప్రత్యేకత ఏమిటి ? అంటే..
ఢిల్లీలోని ఎర్రకోటపై ఉంచిన ఆ పరికరం పేరు.. యాంటీ డ్రోన్ సిస్టమ్. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. ప్రధాని కార్యక్రమం సందర్భంగా భద్రత కోసం ఈ సిస్టమ్‌ను ఎర్రకోటపై ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్ ద్వారా సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే మైక్రో డ్రోన్లను డిటెక్ట్ చేసి వాటిని పనిచేయకుండా జామ్ చేయవచ్చు. అలాగే 1 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని లేజర్ సహాయంతో పేల్చేయవచ్చు.
సాధారణంగా ఇలాంటి పరికరాలను ఆర్మీ వారు వాడుతుంటారు. వీటి సహాయంతో శత్రుదేశాలకు చెందిన డ్రోన్ల కదలికలను తెలుసుకుని వాటిని పేల్చేస్తారు. అయితే మోదీ కార్యక్రమం సందర్భంగా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది.